పుస్తకం గురించి...
పుస్తకం గురించి....ఎవరు ఈ కవిత రాసేరో సరిగా గుర్తులేదు కానీ ఈ క్రింది పాదాలను మననం చేసుకొంటూ వుంటాను.
"పుస్తకం లోకి నడవడమంటే.....
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
ఆ పుస్తకాన్ని తెరుస్తాడు.
ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.
ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.
ఆ రాగ స్పర్శకు వాని మనోయవనికపై
ఓ అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.
దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.
కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.
ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.
నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి."
పుస్తక ప్రేమికులకు /మిత్రులందరికీ శుభాకాంక్షలు.
🌷📖🙏📖🙏📖🙏📖🙏🌷
Comments
Post a Comment