దాంపత్య పాఠం.
*"వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
మీ ఇద్దర్లో ఒకరు వాక్కు అయితే ఒకరు అర్థం. ఒకరు పువ్వు అయితే, ఒకరు పరిమళం.
ఒకటి లేక మరొకటి లేదు.
ఒకరు లేక మరొకరు లేరు.
ఆది దంపతులుగా మీ అనుబంధమే ఓ దాంపత్య పాఠం.
నీ అంతరంగం నిండా అమ్మవారే!
నీకు పార్వతి అంటే ఎంత ప్రేమంటే ఆమెను వదులుకోవడానికి కూడా సిద్ద పడేంత!
ఆ బంధాన్ని ఆమోదించే ముందు ఎంత తర్జన భర్జన పడ్డావూ.
"నాలాంటి మొరటు మనిషిని ఆ సుకుమారి ఎలా భరిస్తుంది పాపం!" అన్న అనుమానం.
"ఈ స్మశాన వాసితో ఆ అంతఃపుర కాంత ఎలా కాపురం చేస్తుందో అన్న భయం! కాబట్టే ,
మారు వేషంలో వెళ్ళి...
"బిచ్చగాడిని కట్టుకుంటే బాగుపడలేవు.
ఇంతకంటే మంచి సంభందం వెతకమని మీ నాన్నగారికి చెప్పుఅని సలహా కూడా ఇచ్చావు.
అయినా సర్వ మంగళ నువ్వే సర్వస్వమంటూ నీ చేయి పట్టుకుంది.
హృదయ నేత్రాలతో దర్శించుకోవాలే గాని నీఅంత అందగాడు ముల్లోకాల్లో ఎక్కడుంటాడు సోమసుందరా!
కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు కదూ! "ఏమండీ మనమూ ఓ ఇల్లు కట్టుకుందాం..."
అని పార్వతీదేవి చెవినిల్లు కట్టుకుని చెప్పింది. నువ్వు వినలేదు.
"వేసవిలో ఎండలు బాగా ఎక్కువ స్వామీ, అనగానే వీధిలోని వేప చెట్టును చూపించి
"ఇక్కడ విశ్రమిద్దాం" అంటావా?
చలికాలంలో గడగడా
వణికిపోతాం నాథా!"
అని ఫిర్యాదు చేయగానే, శ్మశానానికి వెంటబెట్టుకుని వెళ్ళి చితి మంటల దగ్గర చలి కాచుకోమంటావా?
చివరికి "వర్షం సంగతి ఏమిటి అని అడగ్గానే... మేఘాలకంటే ఓ మెట్టు పైకే తీసుకెళ్ళి
"ఇక్కడ ఏ సమస్యా ఉండదు" అని భరోసా ఇస్తావా?
బోళాగా కనిపిస్తావు కానీ,
భలే చమత్కారివి.
పార్వతీ సమేతంగా నువ్వు కొలువు దీరినపుడు భృంగి అమ్మవారిని విస్మరించి నీకొక్కడికే ప్రదక్షిణ చేయబోతే మరుక్షణమే,
ఆమెను సగాన్ని చేసుకుని జగానికో మహత్తర సందేశమిచ్చావు.
దక్ష ప్రజాపతి తన కూతుర్ని అవమానిస్తుంటే తట్టుకోలేక పోయావు.
ఉగ్రుడివై వీరభద్రుడిని సృష్టించావు.
స్త్రీత్వాన్ని గౌరవించడమూ శివతత్వంలో భాగమేనని నిరూపించావు.
ఆ ఉత్తమ సంస్కారాన్ని మాకూ ప్రసాదించు బిక్షపతీ!
*******************
Comments
Post a Comment